కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ లో పర్యటించారు. అనంతరం చార్మినార్ భాగ్య లక్ష్మి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట రోడ్ షోలో పాల్గొన్న అమిత్ షా ప్రసగించకుండానే వెనుదిరగడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో అమిత్ షా మాట్లాడారు.
రోడ్ షోలో తనకు స్వాగతం పలికిన హైదరాబాద్ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఎంఐఎం అండతోనే అక్రమకట్టడాలు వెలిశాయన్నారు. కేసీఆర్ కూడా ఎంఐఎం బాటలోనే నడుస్తున్నారన్నారు.
గత ఎన్నికల తరువాత వంద రోజుల ప్రణాళిక అన్నారు ఏమైంది? హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఏమైంది? హైదరాబాద్ కు ఆయుష్మాన్ భారత్ ఫలాలు అందకుండా టీఆర్ఎస్ అడ్డుపడుతుందన్నారు. నగరంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారని అమిత్ షా ప్రశ్నించారు. ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలన్నారు. లక్ష ఇళ్ళు ఇస్తామన్నారు. 11 వేల ఇళ్లకు మించి లేవు. కేసీఆర్ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ సీట్ల కోసం పోటీ చేయడంలేదన్నారు. మేయర్ పీఠాన్ని గెలిచే తీరతామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి అధికారమిస్తే నగరంలో అక్రమ కట్టడాలన్నీ కూలుస్తామన్నారు. హైద్రాబాద్ కు నిజాం సంస్కృతి నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తితోనే వెళ్లానన్నారు. అందులో రాజకీయ కోణం లేదన్నారు. హైదరాబాద్ గ ఐటీ హబ్ మారుస్తామన్నారు. మేము చేసేదే చెప్తాం అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు.