ఏపీ మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నిమ్మగడ్డ రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇన్నాళ్లుగా తాము చేస్తున్న ఆరోపణలు నిజమని ఆయనే నిరూపించారని పేర్కొన్నారు.
కాగా ఈ నెల 13వ తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో బీజేపీ నేతలు సుజనా చౌదరీ, కామినేని శ్రీనివాస్ లతో రహస్యంగా భేటీ అయిన వీడియోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్యాంగ వ్యవస్థను నిమ్మగడ్డ భ్రష్టు పట్టించారని, బీజేపీ నేతలను ఆయన ఎందుకు కలిసారో.. కలిసి ఏం మాట్లాడారో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ… ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ, సుజనా, కామినేనిలు కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ రహస్య భేటీ వెనుక అసలు సూత్ర దారి చంద్రబాబే అన్నారు. నిమ్మగడ్డకు రాజ్యంగ పదవిలో ఉండే హక్కు లేదని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్నారు. దీనిపై విచారణ చేపట్టి వెంటనే నిమ్మగడ్డని అరెస్టు చేయాలని వైసీపీ పార్టీ తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నానని అంబటి పేర్కొన్నారు.