సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు ఒకప్పుడు కలకళలాడుతూ ఉండేవి. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయ్యిదంటే థియేటర్ల వద్ద చాలా సందడి ఉండేది. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లలో ఉన్నన్ని సౌకర్యాలు లేకపోయినా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు చూసేందుకు అంతా ఇష్టపడేవారు. వీటి సినిమా చూడటం ఒక అనుభూతిగా ఉండేది. కానీ, ఒకప్పుడు అంతలా సందడిగా ఉన్న ఈ థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.
ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూల్చి వాటి స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. మరికొన్ని థియేటర్లు మల్టిప్లెక్స్లుగా మారిపోయాయి. కొన్ని ఫంక్షన్ హాళ్లు, ఇంకొన్ని గోడౌన్లుగా మారాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను నడిపించడం వల్ల నష్టాలు వస్తుండటంతో యాజమానులు థియేటర్లను నడిపించలేక చేతులెత్తేస్తున్నారు. కొందరు యాజమానులు మాత్రం సినిమాలపై ప్రేమతో లాభాలు పెద్దగా లేకపోయినా థియేటర్లను భారంగా నడిపిస్తూ వస్తున్నారు.
అసలే కష్టంగా నడుస్తున్న సింగగిల్ స్క్రీన్ థియేటర్లపై కరోనా వైరస్ భారీగా దెబ్బ కొట్టింది. కరోనా కారణంగా మార్చ్ నుంచి సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పుడు తెరిచేందుకు ప్రభుత్వాలు అవకాశం ఇచ్చినా ప్రేక్షకులు వచ్చే అవకాశాలు తక్కువ. ఈ సమయంలో థియేటర్లను నడిపిస్తేనే ఎక్కువగా నష్టాలు వస్తాయి. దీంతో థియేటర్లు తెరిచేందుకు యాజమానులు ధైర్యం చేయడం లేదు.
10 నెలలుగా నష్టాల్లో మూతబడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ఇప్పుడు అమెజాన్ కన్నుపడింది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫార్మ్ తీసుకువచ్చి థియేటర్ల బిజినెస్‌ను దెబ్బకొట్టిన అమెజాన్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లను సొంతం చేసుకోవాలని చేస్తోంది. ఇందుకు గానూ హైదరాబాద్ నగరంలోని పలు థియేటర్ల యాజమానులతో ఇప్పటికే అమెజాన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. కొన్నేళ్ల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను అమెజాన్ లీజుకు తీసుకుంటోంది.
ఇలా లీజుకు తీసుకున్న థియేటర్లలో ఇక సినిమాలు పడవు. అమెజాన్ గోడౌన్లుగా ఇవి మారిపోనున్నాయి. ఈకామర్స్ రంగంలో దిగ్గజంగా ఎదిగిన అమెజాన్ ప్రతీరోజూ లక్షల్లో వస్తువులను డెలివరీ చేస్తోంది. డెలివరీలను మరింత వేగంగా చేయడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి, అన్ని ప్రాంతాలనూ తేలిగ్గా చేరుకోవడానికి గానూ అమెజాన్ ఇప్పుడు ఎక్కడికక్కడే గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది.
అయితే, నగరంలో స్థలాన్ని తీసుకొని, గోడౌన్లు నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లపై అమెజాన్ దృష్టి పెట్టింది. ఈ థియేటర్లను లీజుకు తీసుకొని గోడౌన్లుగా మార్చుకుంటోంది. గోడౌన్లకు థియేటర్లు చాలా అనువుగా ఉండటం అమెజాన్‌కు కలిసివస్తోంది. సాధారణంగా మంచి హిట్ సినిమాలు విడుదలైతే ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు నెలకు సుమారు 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. హిట్ సినిమాలు పడకపోతే పెద్దగా ఆదాయం కూడా ఉండదు. సాధారణంగా థియేటర్లకు వచ్చే ఆదాయం కంటే రెట్టింపు ఇస్తామని అమెజాన్ ముందుకురావడంతో థియేటర్ల యాజమానులు కూడా తమ థియేటర్లను గోడౌన్లుగా మార్చేందుకు మొగ్గు చూపిస్తున్నారట.