అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని గత 280 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి మహిళా జేఏసీ నేతలు ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను కలిసి అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని, మూడు రాజధానులు వద్దని వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.
అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు చేయవద్దని అన్ని పార్టీల ముఖ్యులకు జేఏసీ ప్రతినిధులుగా వీరు వినతిపత్రాలను సమర్పించనున్నారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులను కూడా కలిసి తమ సమస్య చెప్పనున్నారు. అమరావతిలో మాత్రమే రాజధానిని ఉంచేలా జగన్ సర్కార్‌పై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చే దిశగా ఈ పర్యటన జరుగుతోంది.
ఢిల్లీకి వెళ్లే బృందంలో సుంకర పద్మశ్రీ(కాంగ్రెస్), అక్కినేని వనజ(సీపీఐ), మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(టీడీపీ), రాయపాటి శైలజ(ఐకాస ప్రతినిధి), మహిళా రైతులు కంభంపాటి శిరీష, మువ్వ సుజాత, ప్రియాంక గుర్రం తదితరులు ఉన్నారు.