జైలులోని ఓ టాయిలెట్లో అధికారులు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారనే ఆరోపణ సంచలనంగా మారింది. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేసిన జీఎన్ సాయిబాబా అనే తెలుగు వ్యక్తి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేసులో మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, జైలులోని తన సెల్లో జైలు అధికారులు సీసీటీవీ కెమెరా ఏర్పాటుచేశారని, ఇది మొత్తం సెల్‌తో పాటు అందులోని టాయిలెట్‌ను కూడా వీడియో తీస్తోందని సాయిబాబా ఆరోపించారు.
వెంటనే ఈ సీసీటీవీ కెమెరా తీయకపోతే జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రొ.సాయిబాబా అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై సాయిబాబా భార్య ఏఎస్ వసంత కుమారి, సోదరుడు డా.జి.రామదేవుడు మహారాష్ట్ర హోంమంత్రికి లేఖ రాశారు. కెమెరా కారణంగా సాయిబాబా బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారని వారు ఆరోపించారు. ఆయనను అవమానించేలా ఈ చర్య ఉందని, వెంటనే కెమెరా తీసేయించాలని వారు విజ్ఞప్తి చేశారు.