తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇకపై శ్రీవారిని దర్శించుకునే భక్తులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని నెగిటివ్ రిపోర్టును చూపిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని పేర్కొంది. శుక్రవారం రోజున ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం తర్వాత టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా భక్తులకు కరోనా పరీక్షలు తప్పనిసరి అని తెలిపారు. ఆన్ లైన్ లో ముందుగా దర్శనానికి టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతులు ఇవ్వనున్నట్టుగా తెలిపారు. ఆర్జిత సేవలకు టికెట్లు బుక్ చేసుకున్నవారు దర్శనానికి 72 గంటల ముందుగా కరోనా పరీక్షలు జరిపించుకోవాలని ఆ రిపోర్టును అందించాల్సి ఉంటుందన్నారు.
అదే విధంగా అలిపిరిలో రెండు చోట్ల 2 వేల వాహనాల చొప్పున పార్కింగ్ సముదాయాన్ని నిర్మించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. కొండపై ఎలెక్ట్రిక్ బస్సులను నడిపే విధంగా ఆర్టీసీ ప్రణాలికను తయారు చేస్తుందన్నారు.