కరోనా వ్యాక్సిన్ పట్ల డబ్లూహెచ్ఓ నుంచి వైద్యుల వరకు ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజల్లో ఇంకా సందేహాలు ఉంటున్నాయి. మద్యం, సిగరేట్ తాగేవారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా ? కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు మద్యం, సిగరేట్కు దూరంగా ఉండాలి ? మద్యం తీసుకునే వారికి వ్యాక్సిన్ పని చేయదా ? వంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
వైద్యులు చెబుతున్న దాని ప్రకారం… కరోనా వ్యాక్సిన్‌కు మద్యం, సిగరేట్‌తో సంబంధం లేదు. వ్యాక్సిన్‌కు సంబంధించిన జాగ్రత్తల్లో మద్యం, సిగరేట్ ప్రస్తావన కూడా లేదు. కానీ, వ్యాక్సిన్ వేసుకోవాలి అనుకునే వారు ఈ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. సాధారణంగానే మనిషి రోగ నిరోధక శక్తిపైన మద్యం, సిగరేట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనిషిలోని రోగనిరోధక శక్తిని మద్యం దెబ్బ తీస్తుంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్వల్పంగా ఉండొచ్చు, ఒక్కోసారి ఎక్కువగా ఉండొచ్చు. మద్యం తీసుకున్న తర్వాత ఆ ప్రభావం శరీరంలో 48 గంటల పాటు ఉండే అవకాశం ఉంటుంది. శరీరంలో మద్యం ప్రభావం ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే వచ్చే జ్వరం తీవ్ర అనారోగ్యానికి కూడా కారణం కావొచ్చు.
సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే జ్వరానికి ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ, డాక్టర్లు మద్యం తాగి ఉన్నప్పుడు యాంటీ బయోటిక్ వాడొద్దని సూచిస్తారు. శరీరంలో మద్యం ప్రభావం ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం ఎక్కువగా రావొచ్చు. అప్పుడు యాంటీ బయోటిక్స్ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి, వ్యాక్సిన్ తీసుకునేందుకు కనీసం 3 రోజుల ముందు నుంచే మద్యం, సిగరేట్కు దూరంగా ఉండటం మంచిది.
ఇక, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కనీసం నాలుగైదు రోజుల మద్యం, సిగరేట్కు దూరంగా ఉండటమే మంచిది. వ్యాక్సిన్ ద్వారా కృత్రిమంగా శరీరంలోకి డమ్మీ ఇన్ఫెక్షన్ పంపిస్తారు. మన రోగ నిరోధక వ్యవస్థ నిజమైన వైరస్ వచ్చిందని అనుకొని యాక్టీవ్ అవుతుంది. యాంటీబాడీలు తయారవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా నిజమైన వైరస్ మన శరీరంలోకి వస్తే ఈ యాంటీబాడీలు దానిని బయటకు తరిమేస్తాయి.
వ్యాక్సిన్ తీసుకోగానే జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కూడా ఇదే కారణం. కాబట్టి, వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ త్వరగా తగ్గాలన్నా, వ్యాక్సిన్ సమర్థంగా పని చేయాలన్నా కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనీసం నాలుగైదు రోజులు మద్యం, సిగరేట్కు దూరంగా ఉండటమే మేలు. డాక్టర్లు, నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు కానీ వ్యాక్సినేషన్‌కు సంబంధించి మద్యం, సిగరేట్పైన ఎలాంటి జాగ్రత్తలు పేర్కొనలేదు.