గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చాంద్రాయణ గుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి చేదు అనుభం ఎదురైంది. ఒవైసీ ప్రసంగాన్ని స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ఆయన అసంతృప్తి చెందారు. ప్రసంగం మధ్యలో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముషీరాబాద్ లోని భొలాక్ పూర్ లో అక్బరుద్దీన్ ప్రసంగించడానికి వెళ్లారు.
కాగా అక్కడికి భారీగా తరలివచ్చిన స్థానిక ప్రజలు ముస్లిం వర్గ ప్రజలు అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందాలని నినాదాలు చేసారు. అయితే తాను ప్రసంగిస్తున్న సమయంలో కూడా వారు నినాదాలు ఆపలేదు. మీకు నా ప్రసంగం నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నారు. తమకు రాజకీయ నాయకుల మాటలు అవసరం లేదని కేవలం అభివృద్ధి మాత్రమే కావాలని స్థానికులు డిమాండ్ చేసారు.
స్థానికుల తీరుతో అసంతృప్తి చెందిన అక్బరుద్దీన్ రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రచారంలో భాగంగా అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నవారు.. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మాయమాటలు చెప్తుందన్నారు. టీఆర్ఎస్ తోక ఎలా తొక్కాలో తమకు తెలుసునన్నారు.