టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా ఉంటోంది. అసెంబ్లీలో, బయట టీఆర్ఎస్ పార్టీకి అన్ని అంశాల్లో మద్దతు ఇస్తోంది. అయితే, ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ఇవ్వాలని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసింది. పీవీ విగ్రహాన్ని, చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్మాణించింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కోరింది. పీవీ నరసింహారావు అనేక సంస్కరణలు చేసి దేశాన్ని ప్రగతిపథంలో నడిపారని కేసీఆర్ కొనియాడారు. అయితే, పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మాణాన్ని ఎంఐఎం పార్టీ వ్యతిరేకించింది. ఈ సమయంలో ఎంఐఎం సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే బాబ్రీ మసీదు కూల్చివేశారనే కారణంతో పీవీని ఎంఐఎం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పీవీకి భారతరత్న ఇవ్వాలని చేసిన తీర్మాణం ముస్లింల మనోభావాలకు వ్యతిరేకమని ఎంఐఎం పార్టీ అంటోంది. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఎంఐఎం వ్యతిరేకించింది. కాగా, పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మాణాన్ని కాంగ్రెస్, బీజేపీ సమర్థించడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.