అల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన పార్టీ ఇది. ఆ మాటకొస్తే హైదరాబాద్ అంతటా కూడా కాదు.. కేవలం పాతబస్తీకి మాత్రమే ఈ పార్టీ పరిమితం. కానీ, ఇప్పుడు సినిమా మారింది. దేశవ్యాప్తంగా ముస్లింలకు ప్రతినిధిగా ఎంఐఎం పార్టీ ఎదుగుతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పోటీ చేస్తూ, బలమున్న చోట్ల గెలుస్తూ చాప కింద నీరులా దేశమంతా విస్తరిస్తోంది.
తెలంగాణ తర్వాత ఇప్పటివరకు కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లో అడుగుపెట్టిన ఎంఐఎం ఇటీవలే గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌పైన కన్నేసింది. ప్రస్తుతం ఎంఐఎం పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో దృష్టి పెట్టినట్లు బయటకు కనిపిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా మెల్లిగా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది.
ఓవైసీ సోదరులు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు మంచి స్నేహితులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను బాగా అభిమానించే వ్యక్తులు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన వైఎస్సార్‌ను తరచూ గుర్తు చేసుకుంటుంటారు. గత ఎన్నికల సమయంలోనూ ఏపీలో అడుగుపెట్టకుండా జగన్‌కు మద్దతు ప్రకటించారు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా ఓవైసీ బ్రదర్స్ వ్యూహం మార్చారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు.
ముస్లింలు అధికంగా ఉన్న కర్నూలులోని పలు డివిజన్లతో పాటు విజయవాడలోని రెండు డివిజన్లలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి తరపున ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీతో పాటు హైదరాబాద్‌కు చెందిన కొందరు ఎంఐఎం నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎంఐఎం ఈ ఎన్నికల్లో గెలిచినా, ఇంకా విస్తరించినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం జరగనుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల్లో ఎక్కువ శాతం మంది వైసీపీ వెంట నడుస్తున్నారు. వైసీపీకి పట్టున్న రాయలసీమ జిల్లాల్లో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఒకవేళ ఎంఐఎం కనుక ఏపీలో అడుగుపెడితే వైసీపీ ఓటు బ్యాంకుకే గండి పడనుంది. మిగతా రాష్ట్రాల్లో సెక్యులర్ పార్టీల ఓట్లే ఎంఐఎంకు పడుతున్నాయి. ఏపీలో కూడా ఇదే జరగనుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనుక ఎంఐఎం ప్రభావం ఉండకపోతే ఏపీలో అడుగుపెట్టాలని ఆలోచనను ఎంఐఎం విరమించుకునే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ కనుక గెలిస్తే ఎంఐఎం మరింత వేగంగా ఏపీలో విస్తరిస్తుంది.