కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) చేసిన ఒక అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ పనితీరుకు సంబంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలకు ఈ స్టడీ స్పష్టమైన సమాధానాలు చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కొందరికి కరోనా వైరస్ సోకిందని, కానీ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకున్న వారు మరణించలేదని ఈ స్టడీలో తేలింది.
ఏప్రిల్ – మే నెలల్లో దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఎయిమ్స్ ఈ స్టడీ నిర్వహించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకితే దానిని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఇలా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ వచ్చిన 63 మందిని జినోమ్ సీక్వెన్సింగ్ అనే పద్ధతి ద్వారా ఎయిమ్స్ బృందం అధ్యయనం చేసింది. ఈ 63 మందిలోనూ 27 మందికి కేవలం సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా మరో 36 మంది రెండు డోసులూ తీసుకున్నారు.
10 మంది కోవాక్సిన్ తీసుకోగా, మరో 53 మంది కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరికి కరోనా వైరస్ సోకినా కూడా లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయని ఎయిమ్స్ తెలిపింది. ఈ 63 మందిలో కరోనా వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉందని, వీరిలో ఒక్కరు కూడా మరణించలేని ప్రకటించింది. అందరూ కరోనాను సులువుగా జయించారు. వ్యాక్సిన్ పనితీరును స్పష్టంగా తెలుసుకునేందుకు గానూ ఎయిమ్స్ బృందం ఈ స్టడీ నిర్వహించింది.
21 ఏళ్ల వయస్సు ఉన్న వారి నుంచి 92 ఏళ్ల వయస్సు వారిపై కూడా ఈ స్టడీ చేశారు. 63 మందిలో 41 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. అధ్యయనం చేసిన తర్వాత కోవాక్సిన్, కోవీషీల్డ్ సమర్థంగా పని చేస్తున్నాయని ఎయిమ్స్ బృందం గుర్తించింది. కాగా, ఇప్పటికీ చాలా మంది ప్రజల్లో వ్యాక్సిన్ పనితీరుపై అనుమానాలు, అపోహలూ ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ వస్తుందనే ఉద్దేశ్యంతో కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు.
అయితే, డాక్టర్లు ముందునుంచీ ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని, కాకపోతే దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు కరోనాను సులువుగా జయిస్తారని, వీరికి ప్రాణాపాయం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఎయిమ్స్ జరిపిన స్టడీలోనూ ఇదే విషయం వెల్లడైంది.