కరోనా బారిన పడి మృతి చెందిన వారి మృతదేహాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. అయిన వారు కూడా తమ వారి మృతదేహాలను చూడటానికి భయపడిపోతున్నారు. మృతదేహం దగ్గరకు వెళ్తే తమకు కూడా కరోనా సోకుతుందనే భయం చాలా మంది ప్రజల్లో ఉంది. ఫలితంగా కరోనా మృతులకు గౌరవప్రధంగా అంత్యక్రియలు జరగడం లేదు. అంత్యక్రియలు చేసే సమయంలో పాటించాల్సిన సంప్రదాయాలు కూడా పాటించడం లేదు.
ఈ విషయమై ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సుధీర్ గుప్తా కీలక విషయాలను వెల్లడించారు. కరోనా బారిన పడి మరణించిన వారి ముక్కు, నోటిలో 12 నుంచి 24 గంటల తర్వాత కరోనా వైరస్ క్రియాశీలంగా ఉండదని, కాకపోతే కరోనా మృతదేహాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కరోనా బారిన పడి మరణించిన వారి మృతదేహాల నుంచి 24 గంటల తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చెందదని ఆయన పేర్కొన్నారు. పూర్తి అధ్యయనం తర్వాతనే ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో గత ఏడాదిగా కోవిడ్ మృతదేహాలపై అధ్యయనం చేపట్టారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు గౌరవంగా జరగాలనే ఉద్దేశ్యంతో ఈ అధ్యయనం చేసినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా వెల్లడించారు కరోనా కారణంగా మరణించిన సుమారు 100 మంది మృతదేహాలకు 12 నుంచి 24 గంటల తర్వాత కరోనా వైరస్ పరీక్షలు చేయగా నెగటీవ్ వచ్చినట్లు డాక్టర్ గుప్తా పేర్కొన్నారు.
కానీ, కరోనా మృతుల దేహాలకు సంబంధించి ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా మృతుల ముక్కు, నోటి నుంచి ఎలాంటి ద్రవాలు బయటకు రాకుండా మూసేయాలని ఆయన సూచించారు. కరోనా మృతుల దేహాలను పట్టుకునే వారు కచ్చితంగా పీపీఈ కిట్లు, చేతులకు గ్లౌజులు వేసుకోవాలని, మాస్కులు ధరించాలని ఆయన సూచనలు చేశారు.
మృతిచెందిన వారి అస్థికలను, చితాభస్మాన్ని పారే నీటిలో వదలడం చాలా మంది సంప్రదాయం. కానీ, కొందరు కరోనా మృతుల బంధువులు, కుటుంబసభ్యులు మృతిచెందిన వారి అస్థికలు, చితాభస్మం వంటివి కూడా తీసుకోవడం లేదనే వార్తలు వస్తున్నాయి. వీటి ద్వారా తమకు కూడా కరోనా సోకుతుందేమో అనే భయమే ఇందుకు కారణం. అయితే, చితాభస్మం, అస్థకలను సేకరించడం వల్ల కరోనా వైరస్ సోకదని డాక్టర్ సుధీర్ గుప్తా స్పష్టం చేశారు.