టాలీవుడ్ లో మెగాస్టార్ అంటే చిరంజీవే. ఆయన కాకుండా వేరెవరికైనా ఈ ట్యాగ్ ఇస్తామంటే ఆయన అభిమానులు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇలాంటిదే ఓ వివాదం కొనసాగుతుంది. ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్ ఆహా యాజమాన్యం చేసిన ఓ పొరపాటు మెగాస్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఆహా యాప్ లో సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. అయితే ఈ షోలో ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీలు సందడి చేసారు. తాజాగా అల్లు అర్జున్ ఈ షోలో పాల్గొన్నారు. అయితే అందుకు సంబంధించిన ఓ ప్రోమోను వదిలిన యాజయాన్యం బన్నీని మెగాస్టార్ అల్లు అర్జున్ అంటూ ప్రకటించారు.
దీంతో మెగా అభిమానులు శివాలెత్తిపోతున్నారు. అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ఉండగా మెగాస్టార్ అని టైటిల్ ను ఎందుకు ఇచ్చారంటూ మండిపడుతున్నారు. అయితే ఇటీవల చిరంజీవి ఈ షోలో పాల్గొన్న సమయంలో వేసిన ట్యాగ్ ను తొలగించడం టెక్నీకల్ టీమ్ మరిచిపోయి ఉంటారని అంటున్నారు. చిరంజీవి అభిమానుల ధాటికి వెంటనే ఆ ట్యాగ్ ను తొలగించిన ఆహా యాజమాన్యం తప్పును సరిదిద్దుకుంది.
ఆహా అల్లు వారి ఫ్యామిలీ సొంత నిర్మాణంలో సాగుతుందన్న విషయం తెలిసిందే. బన్నీకి సంబందించిన అన్ని విషయాల్లో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించే ఆయన పిఆర్ టీమ్ దీనిని ఎలా మారుస్తారు? కావాలనే బన్నీకి మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చారని అయన అభిమానులు వాదిస్తున్నారు.