నటుడు జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఆయన మరణించిన వార్త విని టాలీవుడ్ పెద్దలు, హీరోలు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. జయప్రకాశ్ రెడ్డి లేని లోటు టాలీవుడ్‌కు పూడ్చలేనిదని చుబుతున్నారు. టీచర్‌గా పని చేసి నటక రంగంలోకి, ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చిన జయప్రకాశ్ రెడ్డికి ఒక సినిమాను నిర్మించాలని, థియేటర్లలో విడుదల చేయాలని కోరిక ఉండేది.
దీంతో ఆయన అలెగ్జాండర్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉండగా కరోనా కారణంగా ఆగిపోయింది. తన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సహకరించాలని ఆయన పలువురు టాలీవుడ్ పెద్దలను కూడా కోరారు. వారు కూడా జయప్రకాశ్ రెడ్డి సినిమాకు సహకరించేందుకు సిద్ధపడ్డారు. అయితే, సినిమా విడుదల కాకముందే జయప్రకాశ్ రెడ్డి కన్నుమూయడంతో ఆయన చిరకాల కోరిక నెరవేరలేదు.
జయప్రకాశ్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల అనే గ్రామంలో జన్మించారు. రాయలసీమ యాస, అక్కడి ప్రజల పట్ల ఆయనకు చాలా అభిమానం ఉండేది. చాలా సినిమాల్లో ఫ్యాక్షనిస్టుగా నటించిన జేపీ ఒక ఇంటర్వ్యూలో మాత్రం రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏమీ ఉండదని, సీమ ప్రజలు నీతి, నిజాయితీకి ప్రాణం ఇస్తారని చెప్పుకొచ్చారు.