ప్రతి ఏడాది తెలుగు సంవత్సరంలోని మొదటి రోజును ఉగాది పండుగగా జరుపుకోవడం ఆనవాయితి. అలాగే 2021 లో ‘ప్లవ’ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఉగాది నాడే వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ రోజుతో మొదలైన నవరాత్రులు శ్రీ రామ కళ్యాణంతో ముగుస్తాయి. రానున్న ఏడాదిలో మనకు కలిగే మంచి, చెడులను పంచాంగ పఠనం ద్వారా తెలుసుకుని జాగ్రత్త పడుతుంటాం.
తిధి, నక్షత్ర, వారం మొదలైనవన్ని దేవతా స్వరూపాలుగా భావించి సంవత్సరమంతా మంచి జరగాలని ఆరాధిస్తాము. అయితే ప్రతి సారి ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయం పై కొంత గందరగోళం నెలకొంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. కొంత మంది అమావాస్య రోజున ఉగాదిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం అలాంటిదేమీ లేకపోయినా ఉగాది పండగను ఏ రోజు జరుపుకోవాలి అనే విషయంపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
2021 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 13 వ తేదీన ఉగాది పండగను ప్రజలంతా జరుపుకోవాలని ప్రకటించారు. అదే రోజున తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది ఘనంగా నిర్వహించనున్నట్టుగా మంత్రి పేర్కొన్నారు. అయితే కరోనా దృష్ట్యా ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తామని అన్నారు. 13 వ తేదీన ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్ల వద్దనే పంచాంగ పఠన కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు.