తనను కాదని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని కక్ష పెంచుకున్న మహిళ దారుణానికి ఒడిగట్టింది. తనతో పాటుగా ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా పట్టణం జూబ్లీహిల్స్ కాలానికి చెందిన మేకల ప్రదీప్, ప్రసన్న రాణి (45) దంపతులు. వీరిద్దరికి 1999లో వివాహం జరిగింది. ఒక కుమారుడు(20), కుమార్తె(15) ఉన్నారు.
దంపతులిద్దరూ ఐసీడీఎస్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగా ప్రదీప్ భువనగిరి జిల్లాలో, ప్రసన్న రాణి మునుగోడులో పని చేస్తున్నారు. అయితే ప్రదీప్ తన భార్యకు తెలియకుండా ఎనిమిదేళ్ల క్రితం శాంత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి మేఘన(8), రుచరి(4) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భర్త రెండో పెళ్లి విషయం మూడేళ్ళ క్రితమే ప్రసన్న రాణి దృష్టికి వచ్చింది. ఆనాటి నుంచీ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా గత ఆరు నెలలుగా మాత్రం ప్రసన్న రాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. రెండో భార్య, ఆమె పిల్లలతో ఆమె సఖ్యతగా ఉంటుంది. కాగా గురువారం తమ పెళ్లి రోజు కావడంతో ప్రసన్న కుమారి భర్తపై కక్ష తీర్చుకునే ప్లాన్ వేసింది.
ఇంట్లో ఎవరు లేని సమయంలో పక్క వీధిలో ఉంటున్న రెండో భార్య ఇంటికి వెళ్ళింది. కేక్ కటింగ్ పేరుతో ఆమె ఇద్దరు కుమార్తెలను వెంట తీసుకుని ఇంటికి వచ్చింది. అనంతరం బెడ్ రూమ్ లో కేక్ కట్ చేద్దామని పిలిచి చిన్నారులిద్దరికీ ఉరి వేసి హత్య చేసింది. తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది.
సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రదీప్ ప్రసన్నకుమారి, రెండో భార్య పిల్లల శవాలను చూసి దిగ్బ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా ప్రసన్న రాణి చనిపోతూ భర్తకు రాసిన ఉత్తరంలో ”డియర్ ప్రదీప్.. నను కాదని రెండో పెళ్లి చేసుకున్నావ్, 20 ఏళ్ల కొడుకుని పెట్టుకుని ఈ వయసులో రెండో పెళ్లి చేసుకున్నావ్. నీతో సహా నీ కుటుంబం మొత్తం నన్ను మోసం చేసింది. అందుకే నీ జీవితంలోకి వచ్చిన రోజే తిరిగి వెళ్లిపోతున్నా ఇకపై నువ్వు సంతోషంగాఉండొచ్చు. పిల్లలు ఇద్దరు కలిసి ఉండండి” అంటూ ఆమె సూసైడ్ నోట్ లో రాసింది.