logo

  BREAKING NEWS

బ్రేకింగ్: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్ళీ సోనియానే..!

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా సోనియా గాంధీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు మొదలైన సీడబ్ల్యూసీ భేటీ వాడీవేడి చర్చల అనంతరం ముగిసింది. ఈ భేటీలో మరో ఆరు నెలల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్ళీ సోనియానే కొనసాగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది.

ఈ సుదీర్ఘ సమావేశంలో ఎన్నో వాదనలు, ప్రతివాదనల అనంతరం ఆరు నెలలలోగా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అప్పటివరకు పార్టీ ప్రెసిడెంట్ గా సోనియానే ఉండాలని నేతలంతా నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి కొత్త అధినాయకత్వం వస్తుందని అంతా భావించారు. కొత్త అధ్యక్షుడు కచ్చితంగా గాంధీ కుటుంబానికి చెందినవారు అయ్యి ఉండరనే చర్చ సాగింది.

అయితే సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీలోని సీనియర్ నేతలంతా సోనియా అధినాయకత్వానికి ఓటేశారు. వీరిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఏకె ఆంటోనీ ఉన్నారు. అందుకు ఆమె నుంచి కూడా సానుకూలత వ్యక్తమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చివరకు అధ్యక్ష మార్పు లేకుండానే ఈ సమావేశం ముగిసింది. పార్టీకి కొత్త అధ్యక్షడిని త్వరలోనే ఎన్నుకోనున్నారు.

Related News